ChenethaTV, హైదరాబాద్: బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న కరుడుకట్టిన ఓ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట, బాలానగర్, సీసీఎస్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నింధితురాలు పరారీలో ఉన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలానగర్ ఏసీపీ హన్మంతరావు వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా, గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ(60), ఖమ్మం జిల్లా రాయపట్నానికి చెందిన బొజ్జగాని దీనమ్మ(62), బొజ్జగాని నాగేంద్రమ్మ(70), వెంకటరావమ్మ(50), బాలసాని అశోక్(27), డ్రైవర్ బాలసాని వెంకటపతి అలియాస్ నాని ఒక ముఠాగా ఏర్పడ్డారు.
ఈ ముఠా నగరంలోని పలు ప్రాంతాల్లోని బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఇద్దరు చొప్పున విడిపోయి షాపులోకి వెళ్లి బంగారం కొనే ముసుగులో నకిలీ బంగారు వస్తువులను షాపులోపెట్టి అసలు బంగారాన్ని దొంగిలించుకుని పారిపోయారు. దీంతో జగద్గిరిగుట్ట ప్రాంతలోని పలు బంగారు షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా వీరిపై నిఘా ఏర్పాటు చేశారు. గురువారం బొజ్జగానిదీనమ్మ, నాగేంద్రమ్మ, వెంకటరావమ్మ, బాలసాని అశోక్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. బొజ్జగాని జ్ఞానమ్మ, వెంకటపతి పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.
వీరిపై జగద్గిరిగుట్టలో మూడు కేసులు, జీడిమెట్లలో ఒకటి, రాచకొండపరిధిలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. నిందితులను రిమాండ్‌కు తరలించారు. దీనమ్మపై 11, నాగేంద్రమ్మపై 12, వెంకటరమణమ్మపై 12కేసులు వివిధ పోలీస్స్టేషన్ల పరిధుల్లో నమోదు అయినట్టు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో జగద్గిరిగుట్ట సీఐ కె.క్రాంతికుమార్, డీఐ అంజయ్య, సీసీఎస్ సీఐ పాల్గొన్నారు.