గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్..! ఇక అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రక్షాళన

Chenetha Tv, Telangana: ఇప్పటి వరకు గురుకులాలు అంటే.. కులం, మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహ ప్రజల్లో ఉంది.ఇప్పటి వరకు గురుకులాలు అంటే.. కులం, మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహ ప్రజల్లో ఉంది.అయితే..

వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కులం, మతం ప్రాతిపదికన కాకుండా అందరికీ ఒకే తరహా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని డిమాండ్ వస్తుండడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇండిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నది. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.

55 ప్రశ్నలతో క్వశ్చనేర్

ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై స్టూడెంట్స్, పేరెంట్స్, విద్యావేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఏకపక్షంగా విధానాలు రూపొందించి, పిల్లలపై రుద్దడం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృతంగా అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు 55 ప్రశ్నలతో కూడిన క్వశ్చనేర్‌ను రూపొందించింది. ఫీల్డ్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా గురుకులాల్లో వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ప్రస్తుతం రెసిడెన్సియల్ స్కూల్స్‌లో ఉన్న సిస్టమ్‌పై సమగ్రంగా ఆధ్యయనం చేస్తుండగా.. ముందుగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలపై ఆరా తీస్తున్నారు.

పావు వంతు గురుకులాలకే సొంత బిల్డింగ్స్

రాష్ట్రవ్యాప్తంగా 1,024 గురుకులాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్సియల్) ఉండగా, అందులో కేవలం 324 గురుకులాలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా స్కూల్స్ ప్రైవేటు భవంతుల్లోనే కొనసాగుతున్నాయి. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో దశలవారీగా అన్ని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఒక్కో గురుకులం కనీసం 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నది. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో క్లాస్ రూమ్స్, లైబ్రరీ, మోడ్రన్ డైనింగ్, కిచెన్, రీడింగ్ టెబుల్స్, వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది.

త్వరలో పెండింగ్ రెంట్స్ క్లియర్

ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సంబంధించి దాదాపు రూ.70 కోట్ల వరకు అద్దె పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. త్వరలో వాటిని క్లియర్ చేసి, ఆ బిల్డింగ్స్‌లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఓనర్లకు టార్గెట్ పెట్టనుంది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం, బెడ్స్, దోమల బెడదను ఆరికట్టేందుకు రెగ్యులర్‌గా ఫాగింగ్, కిటికీలకు జాలీల ఏర్పాటుకు ఆదేశించనున్నారు. పాములు సంచరించకుండా, పరిసరాలను క్లీన్ చేసేందుకు ప్రత్యేక చొరవ చూపనున్నారు. అలాగే సొంత బిల్డింగ్స్ ఉన్న గురుకులాల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు రంగంలోకి దిగనున్నారు. అందుకోసం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

మెస్‌చార్జీల పెంపు!

ప్రస్తుతం గురుకులాల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జీలతో నాణ్యమైన ఫుడ్ అందించలేకపోతున్నారు. ప్రస్తుతం 5,6,7 క్లాస్ స్టూడెంట్స్‌కు రోజుకు రూ.31.6 పైసలు అందిస్తుండగా.. 8,9,10 చదవుతున్న పిల్లలకు రూ.36.66 పైసలు, ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్‌కు రూ.50 ఖర్చు చేస్తున్నారు. ఈ చార్జీలతో టిఫిన్, లంచ్, డిన్నర్, వారంలో రెండుసార్లు నాన్ వెజ్ అందించడం కష్టంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. అందుకని త్వరలో మెస్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి పౌష్ఠికాహారం అందించేందుకు ఎంత మేరకు మెస్ చార్జి ఇవ్వాలనే ఆంశంపై ఆరా తీస్తున్నది.

గురుకులాలను ప్రక్షాళన చేస్తాం: భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

విస్తృత అభిప్రాయాల మేరకే గురుకులాలను ప్రక్షాళన చేస్తాం. ఏకపక్షంగా నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించదు. పిల్లలకు సరైన విద్యతోపాటు, ఆధునిక వసతులు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం.

మార్పులకు శ్రీకారం చుట్టాం: పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ప్రస్తుత అకడమిక్ ఇయర్ నుంచే గురుకులాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆ వర్గం, ఈ వర్గం అనే తేడా లేకుండా ఆడ్మిషన్ కోసం స్టూడెంట్స్‌ను చేర్చుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పెండింగ్‌లో ఉన్న అద్దెలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే అన్నిరకాల సౌకర్యాలు అందించాలని ఓనర్లను ఆదేశించినం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *