Chenetha TV- Health news: ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సమావేశంలో బత్తిని సోదరులు పంపిణీ చేసే “చేప మందును ” ఆశాస్త్రీయమని తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సీ. రామరాజు గారు మాట్లాడుతూ, జూన్ 8,9 తేదీలలో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పేరుతో చేపను నోట్లో పెట్టి మింగించడం జరుగుతుంది. దీనివల్ల ఉబ్బసం తగ్గుతుందని ప్రచారం చేయడంతో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇది అవాస్తవం. ఈ చేప మందులో ఉబ్బసాన్ని తగ్గించే మందు ఏది లేదని ప్రయోగశాలలో ప్రయోగపూర్వకంగా నిర్ధారించబడినది. చేప మందుపై సిటీ సివిల్ కోర్టు 2012 లో తీర్పును వెలువరించింది. దీనిని మందు అనొద్దని చెప్పింది. దీంతో బత్తిన సోదరులు ఇప్పుడు “చేప ప్రసాదం” పేరుతో పంపిణీ చేస్తున్నారు. వాస్తవంగా వర్షాకాలం ప్రారంభం కాగానే ఆస్తమా వ్యాధిగ్రస్తులు అనేక అవస్థలు పడుతుంటారు. ఈ సమయంలో ఉపశమనం కోసం వారిలో ఏ మందు ఇచ్చిన వేసుకునే బలహీనత ఏర్పడుతుంది. దీన్ని ఆసరగా చేసుకుని చేప మందు ఆస్తమా వ్యాధిని తగ్గిస్తుందని బత్తినిసోదరులు ప్రచారం చేసుకుంటూ ఏళ్ళ తరబడి నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి సైన్స్ లేని మందును వాడొద్దని పిలుపునిచ్చారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గుర్రం ఆంజనేయులు మాట్లాడుతూ, ఆస్తమా అనేది దీర్ఘకాలమైన జబ్బు, తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. ప్రతి ఆయాసం అస్తమా కాదు. ఆయాసం, దగ్గులకు అనేక కారణాలు ఉండవచ్చు. కావునా వాటిని తెలుసుకొని ఆధునిక చికిత్స పొందాలి. చేప ప్రసాదం పంపిణిపై ప్రభుత్వం పునరాలోచించాలి. ఏర్పాట్ల కోసం ప్రజా ధనాన్ని వృథా చేయవద్దు. అంతేకాకుండా మత్స్య శాఖ చేప పిల్లల సరఫరాను నిలిపివేయాలి. ఎలాంటి వైజ్ఞానికత లేక మూడత్వ చేప ప్రసాదాన్ని ప్రజలు వాడకూడదు. ప్రభుత్వం ఆస్తమా వ్యాధికి అన్ని జిల్లా కేంద్ర, ఏరియా ఆసుపత్రిలో నిపుణులతో చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలి. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, నివారణ మార్గాలను తెలియజేయాలి. అప్పుడు ఇలాంటి సైన్సు లేని మందులకు ప్రజలు దూరంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ , జిల్లా ఉపాధ్యక్షులు ప్యారం లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి మేడిపట్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు.