అందాల పోటీలకు రూ. 300 కోట్లు, పుష్కరాలకు రూ. 35 కోట్లేనా?

ChenethaTV_ 300 crores for beauty contest, 35 crores for Pushkar

ChenethaTV- Kaleswaram news: పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద పుష్కర పండుగకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 35 కోట్లు మాత్రమే విడుదల చేయడం ఏర్పాట్లకు ఏమాత్రం సరిపోదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వస్తే, అక్కడి బీజేపీ ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించిందని బండి సంజయ్ గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే, పుష్కరాలను కుంభమేళా తరహాలో కోట్లాది మంది భక్తులను తరలించి ఎంతో వైభవంగా నిర్వహించేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. “అందాల పోటీలకు రూ. 300 కోట్లు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూ.35 కోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం?” అని ఆయన ప్రశ్నించారు. పుష్కరాలను కేవలం ఈ ప్రాంతానికే పరిమితం చేయడం సరైన పద్ధతి కాదని, వచ్చే పుష్కరాలకైనా ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఘనంగా నిర్వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో ఈ ప్రాంతానికి చెడ్డపేరు వచ్చిందని, కనీసం ఈ పుష్కరాల ద్వారానైనా మంచి పేరు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *