
ChenethaTV- Sriharikota news: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య తలెత్తింది. పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్‌ను సమీక్షిస్తున్నారు. 18.05.2025 ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్‌ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందన్నారు. అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు.
ఈ ప్రయోగంతో ప్రయోజనాలివే
ఇస్రోకు ఇది 101వ మిషన్. దీనిద్వారా తదుపరి తరం భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-09 (రిసాట్-1బి)ను పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఈ ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు. దీని జీవితకాలం ఐదేళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్‌తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయింబవళ్లూ ఇమేజింగ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఈఓఎస్-09 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఇది రీశాట్-1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఇది రిసోర్స్‌శాట్, కార్టోశాట్, రీశాట్-2బీ సిరీస్ ఉపగ్రహాల వలే డేటా సేకరించి భూమికి చేరవేయనుంది. 2022లో ప్రయోగించిన ఈఓఎస్-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఈఓఎస్-09ను ఇస్రో రూపొందించడం జరిగింది.